: మూడేళ్లలో దేశంలో తప్పిపోయిన బాలల సంఖ్య 75,000..!
భారత్ లో చిన్నారుల భద్రత మరోసారి ప్రశ్నార్థకం చేస్తూ.. గుండెలు పిండే వాస్తవం ఒకటి వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 75,000 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని రాజ్యసభ వెల్లడించింది.
రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్ సింగ్ ఘటోవార్ మాట్లాడుతూ, మూడేళ్ల వ్యవధిలో మొత్తం 2.36 లక్షల మంది బాలలు తప్పిపోగా వారిలో 1,61,800 మంది ఆచూకీ కనుగొన్నామని ఆయన వివరించారు. మిగతా వారి ఆచూకీ దొరక్కపోవడం దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు.
కాగా, ఇలాంటి వ్యవహారాలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ నోడల్ అధికారిని నియమించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ బాలల కేసుల కోసం ప్రత్యేక విభాగం ప్రారంభించాలని సూచించిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.