: తొలి టెస్టులో భారత్ ఘన విజయం... మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్


వెస్టిండీస్ తో కోల్ కతాలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఆతిథ్య విండీస్ ను చిత్తు చేసింది. హోరా హోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్... బారత బౌలర్ల ధాటికి మూడు రోజుల్లోనే ముగిసింది. విండీస్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 168 పరుగులకే కుప్పకూలింది. భారత యువ బౌలర్ షమీ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 453 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు 219 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ బ్యాట్స్ మెన్ భారత బౌలర్లకు దాసోహమయ్యారు. రెండో ఇన్నింగ్స్ ను ధాటిగా ప్రారంభించిన గేల్ 33 పరుగులకు ఔటయ్యాడు. మరో ఓపెనర్ పావెల్ 36 పరుగులకు పెవిలియన్ చేరాడు. అనంతరం బ్రావో 37 పరుగులకు, శామ్యూల్స్ 4 పరుగులకు వెనుదిరిగారు. ఈ పరిస్థితుల్లో వెటరన్ బ్యాట్స్ మెన్ చందర్ పాల్ ఇన్నింగ్స్ ఓటమి తప్పించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే చందర్ పాల్ కు ఇతర బ్యాట్స్ మెన్ నుంచి సపోర్ట్ దొరకలేదు. వరుసగా వికెట్లు టప టపా రాలిపోతుంటే... చందర్ పాల్ చూస్తుండిపోయాడు. ఈ క్రమంలో రాందిన్ (1), శామీ (8), షిల్లింగ్ ఫోర్డ్ (0), పెర్మాల్ (0), బెస్ట్ (3), కోట్రెల్ (5) వరుసగా పెవిలియన్ చేరారు. 31 పరుగులతో చందర్ పాల్ నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశారు. మొత్తం మీద షమీ ఈ మ్యాచ్ లో 9 వికెట్లు పడగొట్టాడు.

ఈ రోజు ఉదయం 6 వికెట్ల నష్టానికి 354 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ 150, అశ్విన్ సెంచరీ పూర్తిచేసుకున్నారు. చివరకు రోహిత్ 177 పరుగులకు ఔటయ్యాడు. అశ్విన్ 124 పరుగులకు పెవిలియన్ చేరాడు. టెయిలెండర్లు భువనేశ్వర్ కుమార్ (12), షమీ (1) లు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. ఓఝా 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో షిల్లింగ్ ఫోర్డ్ 6 వికెట్లు పడగొట్టాడు.

  • Loading...

More Telugu News