: అంతరిక్షంలోకి దూసుకెళుతున్నా అంతరంగంలో మాత్రం...
అంతుచిక్కని అంతరిక్షంలోకి ప్రయోగాలకోసం దూసుకెళుతున్నా... శాస్త్రవేత్తల అంతరంగం మాత్రం ఇంకా మూఢనమ్మకాలను వీడలేకుంది. మనం శాస్త్రీయ పరంగా ఎంత అభివృద్ధి చెందినా, మనలోని మూఢనమ్మకాలు మాత్రం మనల్ని వదలలేకుండా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యోమగాములు వివిధ విషయాలను నమ్ముతారట.
రష్యా వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేముందు ప్రయోగకేంద్రానికి తమను తీసుకువచ్చిన బస్సు కుడివైపున వెనుక చక్రంపై మూత్రం పోస్తారట. నాసా శాస్త్రవేత్తలు ప్రయోగ సమయంలో బఠాణీలు తింటారట. మనం ఎలాంటి ప్రయోగ సమయంలోనైనా వెంకన్నను దర్శించుకుని పూజలు చేయించడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే మనకు వెంకన్నపై ఉన్న అపారమైన నమ్మకం. ఇదంతా ఒక ఎత్తైతే, వ్యక్తిగతంగా కొందరు శాస్త్రవేత్తలకు కొన్ని నమ్మకాలున్నాయట. ఇస్రోలోని ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రయోగం రోజు తప్పనిసరిగా ఒక కొత్త షర్ట్ ధరించి వస్తారట. ఈ విషయాన్ని ఇస్రోకు చెందిన మాజీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
అంతేకాదు... ఇస్రోకు సంస్థ పరంగా ఇలాంటి నమ్మకాలు లేవని చెబుతూనే పిఎస్‌ఎల్వీకి సంబంధించిన శ్రేణిలో 13వ నంబరుగల పీఎస్‌ఎల్వీ లేకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. పీఎస్‌ఎల్‌వీ 12 తర్వాత 13 పంపాల్సింది... కానీ ఇస్రో ఆ సంఖ్యను వాడకుండా పీఎస్‌ఎల్‌వీ 14ను ప్రయోగించిందంటూ సదరు శాస్త్రవేత్త చెబుతున్నారు. మొత్తానికి ఎంత శాస్త్రవేత్తలయినా నమ్మకాల విషయంలో మాత్రం ఎవరి నమ్మకాలు వారివే మరి!