: ఆ హోటల్‌లో మెనూకార్డు అంధులు కూడా చదవగలరు


సాధారణంగా అంధులు హోటల్‌కు వెళితే ఏం ఉన్నాయి? అంటూ పక్కవారిని అడిగి తమకు కావాల్సింది తెప్పించుకుని తినడం జరుగుతుంటుంది. హోటల్‌లో ఏం ఉన్నాయి? అనేది హోటల్‌ వారు ఇచ్చే మెనూకార్డులో ఉన్నా చూపు లేని కారణంగా వారు తెలుసుకోలేక పక్కనున్న వారిపై ఆధారపడడం జరుగుతుంటుంది. అలాకాకుండా తమకు తామే చదువుకునేలా మెనూకార్డులు బ్రెయిలీ లిపిలో ఉంటే... సరిగ్గా ఇలాంటి ఆలోచనే వచ్చిన ఒక హోటల్‌ వారు మెనూకార్డులను బ్రెయిలీలో తయారుచేయించారు. దీంతో ఈ హోటల్‌కు వచ్చిన అంధ అతిధులు చక్కగా తమకు కావాల్సినవి తామే చదివి తెలుసుకుని ఆర్డరిచ్చి ఆరగించి వెళుతున్నారు.

బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని ఓమ్‌ అనే హోటల్‌ స్థానికంగా పెద్ద పేరున్నదే. ఇప్పుడు దానిపేరు దేశమంతా వ్యాపిస్తోంది. ఎందుకంటే ఈ హోటల్‌లో బ్రెయిలీలో మెనూకార్డు ఉంటుంది. ఈ విషయం గురించి హోటల్‌ యజమాని భావనాజైన్‌ మాట్లాడుతూ ఒకసారి తమ హోటల్‌కు గంగమ్మ అనే అంధురాలు వచ్చిందని, ఆమె అమెరికాలో ఉంటోందని, అక్కడ భరతనాట్యం ప్రదర్శించి బెంగళూరు వచ్చిన సందర్భంలో సాధారణ మెనూకార్డు చదువుకోలేక, హోటల్‌లో ఏమున్నాయని సర్వర్‌ను పదే పదే అడగడం ఆమెకు చాలా కష్టంగా అనిపించిందని, అదే తనకు అర్థమయ్యే భాషలో మెనూకార్డు ఉంటే నెమ్మదిగా ఆమె చదువుకుని తనకు కావాల్సినవి ఆర్డరిచ్చివుండేది కదా అని భావించామని దాని ఫలితమే ఈ బ్రెయిలీలో మెనూకార్డు అని తెలిపారు.

తమ హోటల్‌ పక్కనే ఎనేబుల్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ వికలాంగులు, అంధుల కోసం పనిచేస్తోందని, వారే తనకు బ్రెయిలీలో మెనూకార్డు తయారుచేయాలని సలహా ఇచ్చారని, దాని ఫలితంగానే బ్రెయిలీలో మెనూకార్డు తయారయ్యిందని భావనాజైన్‌ తెలిపారు. దీంతో కర్ణాటకలో బ్రెయిలీలో మెనూకార్డును ప్రవేశపెట్టిన ఘనత ఓమ్‌ హోటల్‌కు దక్కింది. ఇప్పుడు బెంగళూరులోని పలు హోటళ్లు ఓమ్‌ మెనూకార్డు తరహా కార్డులను ఫాలో అయిపోతున్నారు.

  • Loading...

More Telugu News