: అమెరికాలో భారీ మంచు తుపాను.. నలుగురి మృతి
అమెరికాలోని ఉత్తరాది రాష్ట్రాలను మంచు తుపాను కుదిపేసింది. పెద్ద ఎత్తున కురిసిన మంచు.. రోడ్లను, ఇళ్లను కప్పివేసింది. ఈ తుపాను కారణంగా అమెరికాలో ఇప్పటివరకు నలుగురు మరణించారు. దాదాపు 2600 విమానాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వందలాది పాఠశాలలు మూసివేశారు.
మిన్నెసోటా నుంచి వర్జీనియా వరకు మొత్తం 12 రాష్ట్రాలు ఈ తుపాను బీభత్సానికి గురయ్యాయని సమాచారం. మోంటానాలో 2 అడుగుల మేర మంచు కప్పేసింది. ఇక నార్త్ డకోటాలో 15 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయిందని తెలుస్తోంది.
కాగా, అత్యధిక జనాభా కలిగిన నగరం చికాగోలో గంటకు ఓ అంగుళం చొప్పున మంచు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం తుపాను బాధిత ప్రాంతాల్లో అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.