: ఒత్తిడి ప్రభావం ఎంతగా ఉంటుందంటే...
ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందిది ఎక్కువగా ఉరుకుల పరుగుల జీవితం. ఈ పరుగులకు తోడు చేస్తున్న పనిలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ ఒత్తిడి ప్రభావం మనపై చాలా తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎంత తీవ్రంగా అంటే ఒత్తిడి అనేది మన రోగనిరోధక వ్యవస్థపై, మన ఆరోగ్యంగపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఒహయో స్టేట్ వర్సిటీకి చెందిన పరిశోధకులు కార్యాలయాల్లో కలిగే ఒత్తిడి వ్యక్తుల్లో కలిగించే చెడు ప్రభావాలపై లోతైన అధ్యయనం చేశారు. పనిచేస్తున్న ప్రాంతాల్లో ఒత్తిడి అనేది సాధారణం. అయితే ఈ ఒత్తిడి అనేది నిరంతరాయంగా ఉంటే అది సదరు వ్యక్తుల రోగనిరోధక కణాల్లోని జన్యుకార్యకలాపాల్లో అనూహ్య మార్పులకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒత్తిడి మన జన్యువుల్లో కలిగించే మార్పుల కారణంగా అవి రక్తప్రసరణ వ్యవస్థను చేరుకోకముందే మార్పులకు గురవుతాయని, దీని ఫలితంగా కణజాలం రోగాలతో పోరాడే శక్తిని కోల్పోయి బలహీనపడుతుందని, తత్ఫలితంగా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని పరిశోధకులు చెబుతున్నారు. కొంత మేర ఒత్తిడి కాకుండా, ఒత్తిడి అనేది నిరంతరాయంగా సాగుతూవుంటే దాని ఫలితంగా కలిగే దుష్ఫ్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.