: ఎన్నికల ముందు రాష్ట్ర విభజన చేపట్టడం మంచిది కాదు : లగడపాటి
ఎన్నికల ముందు విభజన నిర్ణయం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తోందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఓట్ల కోసమే విభజన చేస్తున్నారని ప్రజలు అనుకుంటారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. పార్టీలు తమ అభిప్రాయాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే... తర్వాత ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. రాష్ట్రం విడిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని అన్నారు. ఈ రోజు ఢిల్లీలో లగడపాటి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఎక్కడా ఉద్యమాలు లేవని... నిర్ణయం తర్వాతే ఉద్యమాలు ఉద్ధృతమయ్యాయని లగడపాటి అన్నారు. కొంత మంది ఊహిస్తున్నట్టుగా, రాష్ట్ర విభజన విషయం అంత సులువైన ప్రక్రియ కాదని తెలిపారు. కీలకమైన 371డి ని సవరించాలని కేంద్ర హోం శాఖ కోరిందని అన్నారు. తెలుగు రాష్ట్రం కలిసుండాలని కోరుతున్నానని చెప్పారు. రాష్ట్ర రాజధాని కాబట్టి అందరికీ హైదరాబాద్ తో అనుబంధం ఏర్పడిందని అన్నారు. విద్య, ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు ఎంతో నష్టం వాటిల్లుతుందని అన్నారు.
అన్ని వసతులు హైదరాబాద్ లోనే ఉన్నాయని... ఇక్కడ నుంచి వెళ్లమంటే ఎలాగని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంతోనే అభివృద్ధి సాధ్యమని లగడపాటి మరోసారి తెలిపారు. కేంద్రానికి సీమాంధ్ర కాంగ్రెస్ తరపున సమగ్ర నివేదిక అందజేశామని చెప్పారు. మూడు ప్రాంతాలు అంగీకరిస్తే తప్ప రాష్ట్ర విభజన చేయరాదని శ్రీ కృష్ణ కమిటీ చెప్పిందని లగడపాటి గుర్తుచేశారు.
హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు ఊచకోత కోస్తుంటే... ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ఎంతో మంది, ఇక్కడి ప్రజలను కాపాడటానికి వచ్చారని తెలిపారు. అన్ని సమస్యలను పరిష్కరించాకే విభజన చేపట్టాలని కోరారు. తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని మరోసారి లగడపాటి కోరారు.