: అన్ని విషయాల్లో సమానమే అయినా...
పురుషులతో పోల్చుకుంటే అన్ని విషయాల్లోనూ మహిళలు సమాన అర్హతలను పొందివున్నా... వేతనాల విషయంలో మాత్రం ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారట. పురుషులతో పోల్చుకుంటే మహిళలకు తక్కువ వేతనాలను కంపెనీలు ఇస్తున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది.
అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా చదువులు చదివి, వారికి పోటీగా ఉద్యోగావకాశాలను అందుకుంటున్నారంటూ ఒకవైపు మనం సంబరపడుతున్నాం. అయితే పురుషులతో సమానమైన ప్రతిభ కనబరుస్తున్నా వారి ప్రతిభకు తగినట్టుగా జీతాలు మాత్రం లభించడం లేదని, పనికి తగిన వేతనం విషయంలో ఇంకా అమ్మాయిలపై సంస్థలు చిన్నచూపునే ప్రదర్శిస్తున్నాయని అహ్మదాబాద్ ఐఐఎం చేసిన అధ్యయనంలో తేలింది.
ఎంబీఏ చదివిన అబ్బాయికీ, అదే కోర్సు చదివిన అమ్మాయికీ జీతాల్లో వ్యత్యాసం ఉంటోందని, అది కూడా పది నుండి నలభై శాతం వరకూ ఉంటోందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. ముఖ్యంగా మనదేశంలో ఎప్పటినుండో అమ్మాయిలకన్నా అబ్బాయిలకే అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతోంది. అలాగే ఏదైనా ఒక ఇంటర్వ్యూకు వెళ్లిన వారిలో అమ్మాయిలకన్నా అబ్బాయిలకే ఉద్యోగం ఇవ్వడానికి సంస్థలు మొగ్గు చూపుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది.