: హిమాచల్ ప్రదేశ్ కు త్వరలో రెండో రాజధాని
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే రెండో రాజధానిగా ధర్మశాలను ఏర్పాటు చేయబోతున్నారు. దీని గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ప్రకటన కూడా చేయనున్నారు. అదీ 2014 లోక్ సభ ఎన్నికలకు ముందే ప్రకటించనున్నారు. హిమాచల్ ప్రస్తుత రాజధాని సిమ్లా. ఈ రాష్ట్రం కొండ ప్రాంతాలకు దగ్గర్లో ఉండటంతో దర్మశాలని వేసవి రాజధానిగా చేయాలని నిర్ణయించారు. దాంతో, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలకు ఉన్నట్టుగా (శీతాకాలం, వేసవి) రెండు రాజధానుల విధానాన్ని హిమాచల్ లో కూడా అవలంబించాలని ఈ ఆలోచన చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రకు రాజధానులుగా ముంబయి, నాగపూర్ ఉండగా.. జమ్ము కాశ్మీర్ కు జమ్ము, శ్రీనగర్ రాజధానులుగా ఉంటున్నాయి. కాగా, శతాబ్దం క్రితం భారత్ ను బ్రిటన్ పాలిస్తున్న సమయంలో ధర్మశాలను రెండో రాజధాని చేయాలని అనుకున్నప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు.