: రాష్ట్రాన్ని శ్మశానం చేసైనా పాలిస్తారా?: జేపీ
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని శ్మశానం చేసైనా సరే పాలించాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చిందని ఆరోపించారు. తెలుగు ప్రజల పట్ల కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని అన్నారు. 1987 తరువాత జరిగిన రాష్ట్రాల విభజనల్లో... స్థానిక ప్రజలను, శాసనసభలను ఒప్పించే విభజించారని ఆయన గుర్తు చేశారు. తెలుగు ప్రజలు రెండు సార్లు గెలిపించిన పాపానికి మీరిచ్చే వరం ఇదా? అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం సీమాంధ్రలో జగన్ తో, తెలంగాణలో టీఆర్ఎస్ తో ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోందని ఆయన మండిపడ్డారు.