: అంగారకుడిపై నివాసానికి ఎందుకంత క్రేజ్?
ఒక డచ్ సంస్థ అంగారకుడిపై నివాసానికి దరఖాస్తులు ఆహ్వానిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా క్యూకట్టి అప్లికేషన్లు పంపించడమేమిటీ..? అందులో ఎనిమిది వేల మంది భారతీయులు ఉండడమేమిటి..? వినడానికి చాలా మందికి ఇది ఆశ్చర్యంగా వుంటుంది. కానీ, ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని కారణాలు లేకపోలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో ఆశ, ఊహ. 2023లో అంగారకుడిపైకి వెళ్లి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతున్నారు.
నెదర్లాండ్స్ కు చెందిన లాభాపేక్షరహిత సంస్థ మార్స్ వన్ 2023లో అంగారకుడిపైకి మానవ యాత్రకు సంకల్పించింది. 2లక్షలకుపైగా వచ్చిన దరఖాస్తుల్లోంచి 40 మందిని ఎంపిక చేసి, అంగారకుడిపై నివాసం విషయంలో వారికి శిక్షణ ఇస్తుంది. అందులోంచి 4 మందిని తుదిగా ఎంపిక చేసి మార్స్ పైకి పంపిస్తుంది.
జితేన్ ఖన్నా.. భారత్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకాయన. ఒకవేళ తాను మార్స్ పైకి వెళ్లే అవకాశం దక్కించుకుంటే నీళ్లు లేకుండా, అక్కడ టిష్యూ పేపర్స్ వాడాల్సిన పరిస్థితిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటానని అంటున్నాడు. మరో దరఖాస్తుదారుడు మణికండన్ మాట్లాడుతూ.. 'అందరూ నన్ను చూసి నవ్వారు. వెర్రోడన్నారు. నేను వెర్రోడిని అయితే ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మంది కూడా వెర్రోళ్లేనన్నాను' అంటూ చెప్పారు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. కారు నడుపుతుంటే యాక్సిడెంట్ జరగవచ్చు. కానీ, చనిపోవడానికి ఒక అర్థం ఉండాలి' అంటూ మార్స్ యాత్రలో ప్రాణం పోయినా పర్వాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.