: బందీని చేసి.. ఎముకలు విరిచి.. అత్యాచారం చేసిన శ్రీలంక సైన్యం
ఎల్టీటీఈపై శ్రీలంక సైన్యం చేసిన దురాగతాలు ఒకదాని తరువాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. శ్రీలంక సైన్యం చేసిన అకృత్యాలపై మానవతా వాదులంతా మండిపడుతున్నారు. తాజాగా బ్రిటన్ కు చెందిన ఛానెల్ 4 చూపించిన దృశ్యాలు కిరాతకుల చీకటి కోణాన్ని బట్టబయలు చేశాయి. 'ఇసై ప్రియ' అంటే తమిళంలో సంగీత స్వరాలకు ఇష్టమైనది అని అర్థం.. ఆమె ఎల్టీటీఈ న్యూస్ ఛానెల్ లో రిపోర్టర్ కమ్ యాంకర్ గా పని చేసింది.
శ్రీలంకలో తమిళుల బాధల్ని కళ్లకు కట్టేట్టు చూపడంలో ఇసై ప్రియది ప్రత్యేక శైలి. శ్రీలంక యుద్ధం సమయంలో జరిగిన ఓ బాంబు దాడిలో ఆమె మరణించిందని ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే ప్రకటించారు. కానీ వాస్తవాలు భయంకరంగా బయటపడ్డాయి. శ్రీలంక సైన్యం న్యూస్ ఛానెల్ పై దాడిచేసి ఆమెను బందీగా పట్టుకుంది. ఆమె చేతులు విరిచి, భుజం ఎముకలు విరిగిపోయేలా వైర్లతో బంధించి, ఒకరి తరువాత ఒకరుగా ఆమెను అనుభవించి నరకయాతన పెట్టి చంపేశారు.
ఆమె చనిపోయిందనే దానికి గుర్తుగా ఆమెపై చిన్న తెల్లటి వస్త్రాన్ని కప్పారు. ఈ దృశ్యాలను ఓ సైనికుడు రహస్యంగా చిత్రీకరించాడు. వీటిని ఛానెల్ 4 ప్రసారం చేయడంతో తమిళులతోపాటు మానవతా వాదులంతా మండిపడుతున్నారు. యుద్ధ ఖైదీలను గౌరవంగా చూడాలని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయి.