: కోపం వస్తే బరువు పెరుగుతారు జాగ్రత్త!
మీరు బరువు పెరుగుతున్నారా... అయితే ముందుగా మీ కోపాన్ని తగ్గించుకోండి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బరువు పెరగడానికి సదరు వ్యక్తిలో ఉండే ఆవేశమే కారణమని శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. రోజువారీ జీవితంలో జాగ్రత్తగా, సహనంగా ఉండే వారి బరువులో పెద్దగా మార్పులు కనిపించవని, అలా కాకుండా కోపధారులు బరువు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ అనే సంస్థ వ్యక్తిత్వ విలక్షణతకు, అధిక బరువుకు మధ్యగల సంబంధాన్ని తెలుసుకోవడానికి మొత్తం 1988 మందిని ఎంపిక చేసి వారి జీవన విధానాన్ని, బరువు, ఆహారపు అలవాట్లపై యాభై ఏళ్లపాటు అధ్యయనం జరిపింది. వ్యక్తుల వయస్సు పెరుగుతున్న కొద్దీ బరువు పెరగకుండా ఉండాలంటే ఆవేశాన్ని తగ్గించుకుని, సమతుల ఆహారం తీసుకుంటూ రోజులో కొంతసేపు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఏంజలినా చెబుతున్నారు. ఆవేశపరులు పనులు చేయడానికి ఇష్టపడరని, కానీ తినడానికి, విందు భోజనాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారని, నెమ్మదస్తులు ఒకరోజు ఆహారం ఎక్కువ తీసుకున్నా తర్వాతరోజు తక్కువగా తీసుకుంటారని, ఆహారం తీసుకోవడంలో కూడా వీరు నియంత్రణ పాటిస్తారని ఏంజలినా చెబుతున్నారు.