: బెంగళూరులో 'నువ్వా నేనా..'
భారత్, ఆసీస్ జట్ల మధ్య ఏడు వన్డేల సిరీస్ చరమాంకానికి చేరుకుంది. రేపు ఇరుజట్ల మధ్య చివరి వన్డే బెంగళూరులో జరగనుంది. భారత్, ఆసీస్ ఇప్పటి వరకు చెరో రెండు మ్యాచ్ లు గెలవడంతో సిరీస్ 2-2తో సమమైంది. రేపు చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ తో సిరీస్ విజేత ఎవరో తేలనుంది. తొలి వన్డేలో ఆసీస్ గెలవగా, రెండో వన్డే భారత్ వశమైంది. ఇక, మూడో మ్యాచ్ లో నెగ్గిన ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం రెండు వన్డేలు వర్షార్పణం కాగా.. మిగిలిన రెండు మ్యాచ్ లలో ఒక్కటి ఓడినా సిరీస్ చేజారుతుందున్న నేపథ్యంలో భారత్ ఆరో వన్డేలో విరుచుకుపడింది. 351 పరుగుల టార్గెట్ ను ఛేదించి 'సిరీస్' ఆశలను సజీవంగా నిలుపుకుంది.
ఈ నేపథ్యంలో రేపటి వన్డేపై ఆసక్తి నెలకొంది. టాస్ మరోసారి కీలకం కానుంది. భారత్ అదే జట్టుతో బరిలో దిగే అవకాశాలున్నాయి. ఇక, పేసర్లు విఫలమవుతుండడం పట్ల ఆసీస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. మూడొందల పైచిలుకు స్కోరును కూడా కాపాడుకోలేకపోవడం వారిని కలవరపెడుతోంది.