: ఈ పండుగ ప్రతి ఏటా జరగాలని తెలుగు తల్లిని కోరుకుంటున్నా: సీఎం కిరణ్
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు మళ్లీ జరుగుతాయో? లేదో? అన్న అనిశ్చితి నెలకొందని ముఖ్యమంత్రి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పండుగ ప్రతి ఏటా జరగాలని తెలుగుతల్లిని కోరుకుంటున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన వేడుకలలో ముఖ్య అతిథిగా సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాలాంధ్రపై స్వర్గీయ ఇందిరాగాంధీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. ఆ సందర్భంలో, తాను గట్టి సమైక్యవాదినని ఇందిర చెప్పారని అన్నారు. వందేళ్ల భవిష్యత్తును ఇందిర ముందే ఊహించారు కాబట్టే... ఈ వ్యాఖ్యలు చేయగలిగారని వివరించారు.
రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని కిరణ్ తెలిపారు. ఇరు ప్రాంతాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కిరణ్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అది సమైక్యాంధ్రతోనే సాధ్యమని పునరుద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్రంలో బలమైన పోలీసు వ్యవస్థ ఉన్నందునే... శాంతిభద్రతలు, ప్రజల రక్షణ, మత సామరస్యం కాపాడగలుగుతున్నామని అన్నారు. రాష్ట్రం కలిసున్నందువల్లే ఇన్ని ప్రాజెక్టులు కట్టగలిగామని కిరణ్ తెలిపారు.