: పరుగులెత్తితే మనకు మేలే
జాగింగ్ చేయడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జాగింగ్ చేసే సమయంలో మనం గాలిని ఎక్కువగా పీల్చుకుంటాము. జాగింగ్ అనేది ఎయిరోబిక్స్ కిందికి వస్తుంది. అంటే గాలిని ఎక్కువగా లోనికి పీల్చుకోవడం. దీనివల్ల శరీరంలోని శక్తి వినియోగమవడమేకాదు... అంతకు మించిన శక్తి ఉద్భవిస్తుంది. నిజానికి అలవాటు లేనివారు పరుగెత్తాల్సి వచ్చినప్పుడు విపరీతమైన ఆయాసం వస్తుంది. అలాకాకుండా క్రమం తప్పకుండా జాగింగ్ చేయడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమేకాదు... పరుగెత్తినప్పుడు ఆయాసం రావడం వంటివి తగ్గుతాయి. జాగింగ్ అనేది శరీరాన్ని అలసట లేదా ఒత్తిడి తట్టుకుని నిలిచేలా చేయగలిగే ప్రక్రియగా చెబుతారు.
జాగింగ్ చేయడం వల్ల గుండెపై భారం పడుతుంది. దీనివల్ల గుండె మరింత ఆరోగ్యవంతంగా ఎక్కువకాలం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. జాగింగ్‌ను ఆరుబయట ప్రదేశాల్లో చేయడం వల్ల మనలోని మానసిక అలజడి తగ్గి, ప్రశాంతతను కలిగిస్తుంది. శరీరం కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటుంది. జాగింగ్ చేయడానికి ప్రత్యేకమైన వస్తువులు, సౌకర్యాలు కూడా అవసరం లేదు. మనకు బాగా సౌకర్యవంతంగా ఉండే బూట్లను వేసుకుంటే చాలు. కాబట్టి మంచి షూ తీసుకుని, వాతావరణానికి అనుగుణంగా చెమటను పీల్చుకునేలా ఉండే బట్టలను వేసుకుని చక్కగా జాగింగ్ ప్రారంభించండి.