: యుగాంతమైనా విత్తనాలు లభిస్తాయి
ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించడం, లేదా యుగాంతమే అయిపోయినా... తిరిగి కొత్త యుగానికి వివిధ విత్తనాలు కావాలి కదా... అప్పుడు చక్కగా విత్తనాల సమస్య తలెత్తకుండా ఉండేలా గట్టి గోదామును తయారుచేశారు. భవిష్యత్తులో ఏదైనా భారీ విపత్తు, లేదా విపరీతమైన వాతావరణ మార్పులు, అణుయుద్ధం వంటివి సంభవించి ప్రపంచంలోని పంటలు మొత్తం నాశనమైపోతే... అప్పుడు ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా స్వాల్‌బార్డ్ ప్రపంచ విత్తన ఖజానాను నిర్మించారు. నార్వేకు చెందిన స్పిట్స్‌బెర్జెన్ ద్వీపంలో ఏర్పాటు చేసిన ఈ విత్తన ఖజానా భవిష్యత్తులో భారీ విపత్తులు సంభవించినప్పుడు ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థకు విఘాతం కలగకుండా ఉండేలా చూస్తుంది.
ఈ విత్తన ఖజానాలో భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వరి, గోధుమ వంటి పలు రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు మొత్తం రెండు వందల కోట్లకు పైగానే ఉన్నాయట. ఈ ఖజానాను భూకంపాలు వంటి విపత్తులేకాదు... అణుయుద్ధం జరిగినా కూడా తట్టుకునేలా నిర్మించారు. ఇందులో 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలో విత్తనం పాడవకుండా పరిరక్షిస్తారు. 2006లో పర్యావరణవేత్త క్యారీ ఫౌలర్ ప్రారంభించిన ఈ విత్తన ఖజానాను రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించారు.