: క్షయ బ్యాక్టీరియా ఇప్పటిది కాదు
క్షయ వ్యాధి ఇప్పటిది కాదు. ఇది ఎప్పుడో ఏడువేల ఏళ్ల నాటి మానవుల్లో వ్యాపించి జీవనాన్ని కొనసాగిస్తోందట. క్షయ బ్యాక్టీరియాపై శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఐరోపాలో క్షయ బ్యాక్టీరియా ఏడువేల ఏళ్ల క్రితమే మనుగడ సాగించిందని, అప్పుడే అత్యంత ప్రాచీన క్షయ కేసు ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.
స్టెగెడ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మురియెల్ మాసన్ నిర్వహించిన పరిశోధనలో హైపర్ ట్రోఫిక్ పల్మనరీ ఆస్టియోపతి (హెచ్‌పీవో) అనే వ్యాధికి వేల సంవత్సరాల క్రితం క్షయ కారణమని, పురావస్తు రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు దక్షిణ హంగేరీలో ఏడువేల సంవత్సరాల క్రితం నాటి ప్రదేశంలో 71 మానవ అస్థిపంజరాలను పరీక్షించారు. వీటి ఆధారంగా ఇన్ఫెక్షన్లు, జీవక్రియ వ్యాధులకు సంబంధించిన కేసులను గుర్తించారు. వీటిలో కొన్ని అస్థిపంజరాల్లో హెచ్‌పీవోకు సంబంధించిన సంకేతాలను కూడా గుర్తించడంతో అప్పట్లోనే క్షయ వ్యాధి ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. డీఎన్‌ఏ, లిపిడ్స్ పరీక్షలు చేపట్టడం ద్వారా క్షయకు సంబంధించిన బ్యాక్టీరియా మనుగడను నిర్ధారించారు. ఇప్పటి వరకూ హెచ్‌పీవో, క్షయకు సంబంధించి ఇదే అత్యంత ప్రాచీన కేసుగా భావిస్తున్నట్టు మాసన్ చెబుతున్నారు.