: జీతం ఎక్కువిస్తున్నారని ఉద్యోగమే వదిలేశాడు..
జీతం తక్కువిస్తున్నారని ఉద్యోగాలు మానేసినోళ్లను చూసి ఉంటారు. కానీ, 32 ఏళ్ల బెంగళూరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీతం ఎక్కువిస్తున్నారని ఉద్యోగం వదిలేశాడు. అదే విచిత్రం. తనకు ఎక్కువిస్తున్నారు అనే భావన అతడిలో డిప్రెషన్ కు దారితీసిందట. ఫలితమే.. ఉద్యోగానికి రాజీనామా. ఈ ఇంజనీర్ షిజో అఫెక్టివ్ సైకోసిస్ అనే మానసిక స్థితితో బాధపడుతున్నట్లు ఆయనకు వైద్యం చేస్తున్న సైకియాట్రిస్ట్ చెబుతున్నారు.
ఈ ఇంజనీర్ కు నెలకు 40వేల రూపాయల జీతం. అనుభవం ఎనిమిదేళ్లు. నిజానికి ఇంత అనుభవం ఉన్నవాళ్లకు 60వేల రూపాయల జీతం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కానీ, అతడికి మాత్రం తానేదో ఎక్కువ జీతం తీసుకుంటున్నానని మనోవేదన. దాంతో, నెల జీతం రాగానే ఆ మొత్తాన్ని బాస్ చేతిలో పెట్టేవాడట. దీనికి కారణం చిన్న తప్పులను పెద్దగా చూస్తూ తమకు చేతకాదనుకునే ఆత్మన్యూనత భావం వల్ల ఇలాంటి స్థితి ఎదురవుతుందని సైకియాట్రిస్ట్ అంటున్నారు. మెదడులో చోటు చేసుకునే కొన్ని రసాయనిక మార్పుల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుందట.