: ద్రావిడ్ బ్యాట్ తో డబుల్ సెంచరీ చేసిన మహారాష్ట్ర అమ్మాయి
రాహుల్ ద్రావిడ్ క్రికెట్ నుంచి రిటైరైనా, ఆయన బ్యాటు మాత్రం ఇంకా పరుగుల వర్షం కురిపిస్తూనే ఉంది. అదెలాగంటారా..! అయితే, ఇది చదవండి. వెస్ట్ జోన్ అండర్-19 మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో మహారాష్ట్ర, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో మహారాష్ట్ర అమ్మాయి స్మృతి మంధానా (17) అత్యద్భుతమైన రీతిలో డబుల్ సెంచరీ సాధించింది. కేవలం 150 బంతుల్లోనే అజేయంగా 224 పరుగులు చేసింది. భారత్ కు చెందిన మహిళా క్రికెటర్ డబుల్ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి. గుజరాత్ లోని వడోదరలో జరిగిన ఈ మ్యాచ్ లో స్మృతి బ్యాటింగ్ విన్యాసాలతో మహారాష్ట్ర 375 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం, లక్ష్యఛేదనలో గుజరాత్ 32 పరుగులకే చాపచుట్టేసింది.
డబుల్ సెంచరీతో వార్తల్లోకెక్కిన ఈ మరాఠీ వనిత మ్యాచ్ లో వినియోగించిన బ్యాట్ రాహుల్ ద్రావిడ్ దట. స్మృతి సోదరుడు ఓసారి బెంగళూరు వెళ్ళినప్పుడు ద్రావిడ్ ను కలిసి, తన సోదరి క్రికెట్ అభిరుచి గురించి చెప్పగా.. ద్రావిడ్ తన ప్రాక్టీస్ బ్యాట్ ను ఆమెకివ్వమని తెలిపాడట. మ్యాచ్ అనంతరం స్మృతి ఈ విషయాలను మీడియాతో పంచుకుంది. ఈ బ్యాట్ తో ఆడుతున్నప్పటి నుంచి పరుగులు వెల్లువెత్తిస్తున్నానని సంతోషంగా చెప్పింది.