: పటేల్ లేకుంటే భారతదేశం ఇలా ఉండేది కాదు: అద్వానీ
గుజరాత్ లోని సర్థార్ వల్ల భాయ్ పటేల్ యూనిటీ స్టాచ్యూ పనులకు శంకుస్థాపన సందర్భంగా బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ పటేల్ జీవితం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను వివరించారు. భారత దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం ఎగసి పడుతున్నప్పుడు నేవీ, ఆర్మీలో కూడా తిరుగుబాటు వచ్చినప్పుడు దేశం విడిచి వెళ్లిపోదాం అని ఆంగ్లేయులు నిర్ణయించుకున్నారని తెలిపారు. 500 సంస్థానాలు ఎవరివి వారికే చెందుతాయని ప్రకటించి తెల్లదొరలు వెళ్లిపోయారని చెప్పారు. హైదరాబాదులో నిజాం తలవంచేలా చేయడానికి వల్లభాయ్ పటేల్ తీవ్రంగా కృషి చేశారని అన్నారు.
రజాకార్లు, నిజాం ప్రభుత్వం స్థానిక మహిళలపై చేస్తున్న దురాగతాలు ఆపి భారత దేశంలో విలీనం కాకుంటే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పటేల్ హెచ్చరించారని అద్వానీ తెలిపారు. జోధ్ పూర్ మహారాజు నాటకాలు కొనసాగకుండా పటేల్ అడ్డుకున్నారని తెలిపారు. సర్థార్ పటేల్ లేకుంటే భారత దేశం ఇప్పుడున్న రూపంలో ఉండేది కాదని అన్నారు. అన్ని సంస్థానాలను ఏకతాటిపైకి తేవడం సాధ్యమైన పని కాదని అలాంటిది పటేల్ సుసాధ్యం చేసి చూపించారని కొనియాడారు. దేశానికి వల్లభాయ్ పటేల్ లాంటి నేతల అవసరం చాలా ఉందని, ఉక్కు మనిషిని ఈ రకంగా స్మరించుకోవడం సముచితమని అద్వానీ అభిప్రాయపడ్డారు.