: తినడానికీ ఓ తీరుంది
దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. మనం చదవడానికి, వ్యాయామం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తాంకదా... అలాగే తిండి కూడా ఒక పద్ధతి ప్రకారం తినాలంటున్నారు నిపుణులు. కొందరు డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటుంటారు. అలాకాకుండా కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతోమేలని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో మూడు పూటలు మాత్రమే ఆహారం తీసుకుంటూ, ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కాకుండా, ప్రతి మూడు గంటలకు ఒకసారి ఏదైనా ఆహారం తీసుకునేలా చూడాలని, అలాగే తినే ప్రతిసారీ కడుపునిండా తినకుండా కొద్ది మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు.
ఒకసారి తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాతే మళ్లీ ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్, ప్రోటీన్లతోబాటు మితమైన కొవ్వులు కూడా ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో ఉప్పు, కొవ్వులు, కార్బొహైడ్రేడ్లు ఎక్కువ మోతాదులో లేకుండా చూసుకోవాలి. ఉప్పు, కొవ్వుతో నిండిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేలా చేస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నం కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. తాజా కూరగాయలు మూడు పూటలా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. పండ్లను జ్యూస్ రూపంలో కాకుండా సలాడ్ల రూపంలో తీసుకోవడమే మంచిది. ఆహారం తీసుకునేందుకు అరగంట ముందుగానీ, లేదా ఆహారం తిన్న రెండు గంటల తర్వాతగానీ పండ్లను తినడం మంచిది. ఇలా ఒక పద్ధతి ప్రకారం ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.