: పారాసెటమాల్ మందుతో శిశువులకు ప్రమాదమట
గర్భంతో ఉన్న సమయంలో తల్లులు తీసుకునే ఆహారం పిల్లలు పుట్టిన తర్వాత వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గర్భంతో ఉన్న మహిళలు పారాసెటమాల్ మందును ఎక్కువ కాలంపాటు వాడడం వల్ల వారికి పుట్టబోయే శిశువులో ప్రవర్తనా సంబంధమైన సమస్యలు, కదలిక సమస్యలు, భావ వ్యక్తీకరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గర్భంతో ఉన్న తల్లులు ఏమొచ్చినా సాధారణంగా పారాసెటమాల్ మందును ఉపయోగిస్తుంటారు. అయితే దీన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల శిశువులో పలు సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. నార్వేజియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో భాగంగా సుమారు మూడు వేలమంది చిన్నారులను పరిశీలించారు. తల్లిగర్భంలో ఉండే శిశువులు 28 రోజులకన్నా ఎక్కువగా పారాసెటమాల్ ప్రభావానికి లోనైతే వారిలో సమస్యలు తలెత్తుతున్నట్టు ఈ పరిశీలనలో తేలింది. కేవలం కొద్ది రోజులు మాత్రమే ఈ మందును వాడితే సమస్య తక్కువగా ఉన్నదని, అదే ఇబూబ్రూఫెన్ మాత్రతో సుదీర్ఘ కాలంలో ఈ తరహా సమస్యలు కనిపించలేదని పరిశోధకులు చెబుతున్నారు. గర్భంతో ఉన్న తల్లులు పారాసెటమాల్ మందును కొద్దిరోజులు వాడడం వల్ల శిశువుకు ఎలాంటి హాని ఉండదని, అయితే సుదీర్ఘ కాలం పాటు వాడితే శిశువులో సమస్యలు తలెత్తే ప్రమాదముందని దీనిపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందని ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రొఫెసర్ హెడ్విగ్ నార్డెంగ్ చెబుతున్నారు.