: హైహీల్స్ వేస్తే కీలు అరుగుతుందట!
అమ్మాయిలు చాలా వరకూ ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. తాము పొట్టిగా ఉండడం వల్లనో, లేదా ఫ్యాషన్‌గా భావించడం వల్లనో, లేక మరేదైనా కారణాల వల్లనో హైహీల్స్ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి వాళ్లకు మోకాలి కీళ్లు అరిగిపోయే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చైనాలో నిర్వహించిన తాజా అద్యయనంలో ఎత్తు మడమల చెప్పులను ధరించిన వారికి మోకాలి కీలులో అరుగుదల కనిపించినట్టు తేలింది.
చైనాలోని నింగ్‌బో విశ్వవిద్యాలయం క్రీడాశాస్త్ర అధ్యాపక బృందం నిర్వహించిన పరిశోధనలో హైహీల్స్ చెప్పులు ధరించిన వారిలో మోకాలి కీలులో అరుగుదల కనిపించినట్టు తేలింది. ఈ విషయాన్ని గురించి పరిశోధకులు మాట్లాడుతూ హైహీల్స్ ఉన్న చెప్పులు, షూలు వేసుకుని రోజూ బస్సు ఎక్కడానికో లేదా ఏదో ఒక విషయానికి పరుగులెత్తాల్సి వస్తుందని ఇది అమ్మాయిల్లో సహజంగా ఉంటుందని, అయితే హైహీల్స్ వేసుకుని పరుగులెత్తడం వల్ల దీర్ఘకాలంలో దాని ప్రభావం మోకాలి కీలుపై ఎక్కువగా ఉంటుందని, హైహీల్స్ వల్ల మోకాలిపై ఎక్కువ భారం పడుతుందని, దీని ఫలితంగా కీలు అరుగుదల వేగవంతం అవుతుందని, మడమల్లో కూడా ఇది తీవ్రమైన నొప్పికి కారణమవుతుందని చెబుతున్నారు.