: విభజన ప్రక్రియ ముందుకు సాగదు: పయ్యావుల


రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల విభజనపై రాజ్యాంగం పటిష్ఠ సూచనలు చేసిందని, అంతకు ముందు ప్లెబిసైట్ కూడా నిర్వహించాలని అనుకున్నారని అన్నారు. ఒక దశలో బాబాసాహెబ్ అంబేద్కర్ విభజనకు ఆ ప్రాంతంలోని జనబాహుళ్యం మొత్తం ఆమోదం తీసుకోవాలని తెలిపారని పయ్యావుల చెప్పారు. అంబేద్కర్ సూచన, ఆలోచన ప్రకారం రాష్ట్ర విభజన శాసనసభ ఆమోదంతోనే జరగాలని పయ్యావుల తెలిపారు. తెలుగుగడ్డ మీద అడుగుపెట్టకుండా జీఎంవో విభజన నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజాగా, అఖిలపక్షం సమావేశంపై మాట్లాడుతూ.. కేంద్రం మెట్టు దిగలేదని, రాష్ట్రపతి మొట్టికాయ వేశారు కనుకే అఖిలపక్షం అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సినప్పుడు, కేంద్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు, కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకత ఎదురైనప్పుడు అఖిలపక్షమా? అంటూ పయ్యావుల ప్రశ్నించారు. ఇతర పార్టీ నేతలు ఢిల్లీ వచ్చి వినతిపత్రాలు ఇస్తే, ఆందోళనలు చేస్తే కనీసం పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు. విభజన శాసనసభ తీర్మానం ద్వారా ముందుకెళుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News