: విద్యార్థుల సౌలభ్యం కోసమే ఇంటర్ పరీక్షల వేళలు మార్చాం: తివారీ
పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవడంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బందులెదుర్కొంటున్నందునే ఈసారి ఇంటర్ పరీక్షల వేళలు మార్చినట్టు మాధ్యమిక విద్యా శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ వెల్లడించారు. కాగా, బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన మీడియాకు వివరించారు.
ఇంతకుముందు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్షలు నిర్వహించేవారమని, ఈసారి అందుకు భిన్నంగా 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తగిన రవాణా సౌకర్యాలు లేక గ్రామీణ విద్యార్ధులు పలు అవస్థలు పడుతున్నకారణంగానే వేళల్లో మార్పు నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. కాగా, ఇంటర్ ఫలితాలను వచ్చే నెల 24 కల్లా విడుదల చేస్తామని తివారీ తెలిపారు.