: మెరిసిన మాస్టర్.. మురిసిన ముంబయి
హర్యానాతో రంజీ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ (79 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో ముంబయికి విజయాన్ని కట్టబెట్టాడు. విజయానికి మరో 39 పరుగులు అవసరం కాగా, ఈ ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబయి జట్టు లంచ్ కు ముందే గెలుపుతీరాలకు చేరింది. ఓవర్ నైట్ స్కోరు 201/6తో బరిలో దిగిన ముంబయి మరో వికెట్ కోల్పోకుండా మ్యాచ్ ను చేజిక్కించుకుంది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఐదు పరుగులకే వెనుదిరిగి విమర్శకులకు పనికల్పించిన సచిన్.. తన అపార అనుభవం విలువ ఏపాటిదో రెండో ఇన్నింగ్స్ లో చాటాడు. బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై హర్యానా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.
ధవళ్ కులకర్ణి (16 నాటౌట్)తో ఏడో వికెట్ కు అజేయంగా 50 పరుగులు జోడించడం విశేషం. సచిన్ అద్భుతమైన ఫిఫ్టీతో విండీస్ తో టెస్టు సిరీస్ కు ముందు ఫామ్ ను దొరకబుచ్చుకున్నాడు. హర్యానాలోని లాహ్లీలో జరిగిన ఈ రంజీ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో హర్యానా 134, ముంబయి 136 పరుగులు చేశాయి. అనంతరం, రెండో ఇన్నింగ్స్ లో హర్యానా 241 పరుగులు చేసి ముంబయి ముందు 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా, ఈ విజయంతో ముంబయి ఖాతాలో 6 పాయింట్లు చేరాయి.