: గడువు తీరడంతో జైలుకెళ్లిన సంజయ్ దత్
పెరోల్ గడువు తీరడంతో నటుడు సంజయ్ దత్ పుణెలోని ఎరవాడ జైలుకు పయనం అయ్యారు. ఈ ఉదయం 6.30 గంటల సమయంలో భార్య మాన్యతాదత్ తోడు రాగా ఆయన ముంబై నుంచి పుణేకి బయల్దేరి వెళ్లారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల సమయంలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై సంజయ్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ నెల 1న 14 రోజుల పెరోల్ పై సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. మధ్యలో మరోసారి గడువును పొడిగించారు. అది కూడా పూర్తవడంతో ఆయన జైలు బాట పట్టారు.
సంజయ్ దత్ కాలిలో రక్తం గడ్డకట్టుకుపోయే సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసమే ఆయన పెరోల్ మీద బయటకు వచ్చారు. జైలుకెళ్లే ముందు సంజయ్ దత్ మీడియాతో మాట్లాడుతూ.. తానిప్పటికీ సమస్యతో బాధపడుతున్నానని, కాకపోతే ఇంతకుముందు కంటే కొంచెం నయమని చెప్పారు. అభిమానులు తన కోసం ప్రార్థిస్తే త్వరగా బయటకు రాగలనని చెప్పారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.