: ప్రముఖ నటి, నర్తకి రాజసులోచన కన్నుమూత


ప్రముఖ సినిమా నటి, నర్తకి రాజసులోచన చెన్నయ్ లోని ఆమె స్వగృహంలో ఈ రోజు ఉదయం కన్నుమూసారు. 77 సంవత్సరాల రాజసులోచన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు . తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆమె వందలాది సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకుడు సి.యస్. రావు ఈమె భర్త. వీరికి ఇద్దరు కవలపిల్లలున్నారు.

1935 ఆగష్టు 15 న ఈమె విజయవాడలో జన్మించారు. తండ్రి భక్తవత్సలం నాయుడు రైల్వేలో ఉద్యోగి కావడంతో బదిలీపై చెన్నయ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 1953 లో 'గుణసాగరి' అనే కన్నడ సినిమా ద్వారా ఆమె నటిగా వెండితెరకు పరిచయమయ్యారు. పెంకిపెళ్ళాం, ఆల్లా ఉద్దీన్ అద్భుత దీపం, రాజమకుటం, సువర్ణసుందరి, పెళ్లినాటి ప్రమాణాలు, వెలుగు నీడలు, పాండవ వనవాసం వంటి పలు సినిమాల ద్వారా ఆమె నటిగా, నర్తకిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

అప్పట్లో ప్రతి సినిమాలోనూ ఆమె పాట ఒకటి వుండడం అన్నది కొన్నాళ్ళ పాటు ఆనవాయతీగా మారిపోయింది. 'ఈ సినిమాలో రాజసులోచన పాట వుంది' అని గొప్పగా చెప్పేవారు. అలాగే నటిగా కూడా ఆమె కొన్ని చక్కని పాత్రలు పోషించారు. చివరిసారిగా ఆమె 1995 లో 'తోడికోడళ్ళు' సినిమాలో జయసుధ, మాలాశ్రీలకు తల్లిగా నటించారు.   

  • Loading...

More Telugu News