: పొగ మానేయడం కూడా శ్మశానవైరాగ్యం లాంటిదే
శ్మశానవైరాగ్యం అంటే మనందరికీ తెలుసు. అంత్యక్రియలకు వెంట వెళుతూ.. శ్మశానం వరకు వెళ్లినప్పుడు అందరిలోనూ భవబంధాల మీద ఒక విరక్తి పుడుతుంది. అక్కడినుంచి తిరిగి ఇంటికి రాగానే ఎవరి ప్రాపంచిక జీవితంలో వారు నిమగ్నం అయిపోతారు. చూడబోతే ధూమపాన ప్రియులు సిగరెట్ మానేయాలని అనుకునే సంకల్పం కూడా అలాంటిదే అన్నట్లు కనిపిస్తోంది.
స్మోకర్లలో సిగరెట్ మానేసే ఆలోచన సోమవారమే ఎక్కువగా వస్తుంటుందని పరిశోధకులు నిగ్గు తేల్చారు. శాండియాగో స్టేట్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అనేకులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. వారం పారామీటర్పై ఈ అలవాటు మానేయాలనే కోరిక ఎప్పుడు పుడుతుందో వారు పరిశీలించారు. 2008 నుంచి 2012 వరకు ఇంగ్లిష్, ఫ్రెంచ్, చైనీస్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ వంటి భాషల్లో గూగుల్ సెర్చ్ ద్వారా ప్రపంచంలో పొగమానేయడానికి ఎందరు వెతుకుతున్నారో వీరు గమనించారు. ప్రతివారం తొలిరోజుల్లోనే ఈ సెర్చ్ ఎక్కువగా ఉంటుందని.. తర్వాత మందగిస్తుందని పరిశోధన తెలియజెప్పింది.