: టీమిండియాకు చావో రేవో!
ఆసీస్ తో ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు నాగపూర్లో జరిగే మ్యాచ్ లో టీమిండియా చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తాజా సిరీస్ లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉండగా, రెండు వన్డేలు వర్షార్పణమయ్యాయి. దీంతో, సిరీస్ కోల్పోకూడదంటే భారత్ మిగిలిన రెండు వన్డేల్లో నెగ్గడం తప్పనిసరి. కాగా, చివరి రెండు వన్డేల్లో ఒక్కటి గెలిచినా సిరీస్ ఆసీస్ వశమవుతుంది. ఇక, మ్యాచ్ సన్నద్ధతపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.
గెలవక తప్పని మ్యాచే అయినా, తమపై ఒత్తిడి ఏమీ లేదని చెప్పాడు. నాగపూర్ వన్డేకు అన్ని విధాలా సమాయత్తమయ్యామని తెలిపాడు. అన్ని మ్యాచ్ లలాగానే దీన్నీ ఆస్వాదిస్తామని వివరించాడు. ఈ సిరీస్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా పరుగులు సాధిస్తుండడంపై మాట్లాడుతూ, టీమిండియా బౌలింగ్ విభాగం మెరుగుపడాల్సి ఉందని అంగీకరించాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్ కొన్ని హై రిస్క్ షాట్లతో విరుచుకుపడి టీమిండియా బౌలింగ్ కు సవాల్ విసిరారని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక, ఫీల్డింగ్ కూడా ఆశించినంత స్థాయిలో లేదని అభిప్రాయపడ్డాడు.