: సీమాంధ్ర నేతలు ఇంకా ప్రజలను మభ్యపెట్టే పనిలోనే ఉన్నారు: డీకే అరుణ
కేంద్రం స్పష్టమైన నిర్ణయం వెలిబుచ్చినా, రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర నేతలు ఇంకా ప్రజలను మభ్యపెట్టే పనిలోనే ఉన్నారని మంత్రి డీకే అరుణ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో జరుగుతున్న కాంగ్రెస్ జైత్రయాత్ర సభలో ఆమె ప్రసంగించారు. అన్ని పార్టీలు నిర్ణయం తెలిపిన మీదటే విభజన ప్రకటన చేశారని స్పష్టం చేశారు. అది కేంద్రం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు తెలియకుండా కొందరు నేతలు మనుగడ కోసం డ్రామాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, అమరవీరుల త్యాగఫలం తెలంగాణ అని అభివర్ణించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్న సోనియాకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.