: కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో జీమెయిల్, యాహూలపై నిషేధం
సమీప భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో జీమెయిల్, యాహూ లాంటి ప్రైవేటు ఈ మెయిల్ సర్వీసులు పనిచేయవు. ప్రభుత్వ కార్యాలయాలలో ఇప్పటిదాకా సమాచార మార్పిడి కోసం జీమెయిల్, యాహూలాంటి మెయిల్ సర్వీసులపై ఆధారపడుతున్నందున.. సైబర్ నేరగాళ్ల దాడులకు ఆస్కారం కలుగుతోంది. మాల్వేర్ వైరస్ ల ద్వారా కీలక, సున్నిత సమాచారాన్ని హ్యాకర్లు కొల్లగొడుతున్నారు.
ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు చొరబడడానికి అవకాశం లేని రీతిలో సమాచార భద్రతకు ప్రభుత్వ కార్యాలయాలలో ప్రైవేటు మెయిల్ సర్వీసులు వాడకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగం బిల్లును రూపొందించింది. దీనిపై ఇతర మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం డిసెంబర్ నుంచి అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాలలో అధికారిక వెబ్ సైట్ ఎన్ఐసీ ద్వారానే మెయిల్స్ పంపుకోవాల్సి ఉంటుంది.