: రాజ్, ఉద్దవ్ ఠాక్రేలను కలుసుకున్న శిల్పాశెట్టి దంపతులు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మహారాష్ట్రలోని ప్రధాన ప్రతిపక్షం శివసేన పార్టీ అధిపతి ఉద్దవ్ ఠాక్రేతోపాటు, మహారాష్ట్ర నవనిర్మాణసేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతోనూ భేటీ అయ్యారు. శనివారం ఎంఎన్ఎస్ సినీ కార్మికుల సంఘానికి చెందిన సభ్యులు కొందరు ముంబైలోని అంబోలీ ప్రాంతంలో ఉన్న ఫిల్మాలయ స్టూడియో వద్ద విధ్వంసానికి పాల్పడ్డారు. బలవంతంగా స్టూడియోలోపలకి చొచ్చుకువెళ్లి ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. తర్వాత ఒక షూటింగ్ సెట్ ను ధ్వంసం చేశారు.
ఆ సమయంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా స్టూడియోలోనే ఉన్నారు. ఈ స్టూడియోలో ఆయనకు కూడా వాటా ఉంది. జరిగిన దానిపై రాజ్ కుంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మద్దతు కోరుతూ శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేను కలుసుకున్నారు. మద్దతుపై హామీ లభించాక.. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను కూడా కలుసుకున్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని ఆ సందర్భంగా రాజ్ ఠాక్రే వారికి సూచించగా.. అందుకు రాజ్ కుంద్రా నిరాకరించినట్లు సమాచారం.