: ట్విట్టర్‌లో దుమ్మురేపుతున్న పోప్‌ ఫ్రాన్సిస్‌


ఏదో పాప్‌ సంగీత గాయకులకు ట్విట్టర్‌లో ఫాలోయింగ్‌ అదిరిపోతోందంటే ఓకే అనుకోవచ్చు. కానీ.. కేథలిక్‌ ఆధ్యాత్మిక వచనాల్ని ప్రచారం చేస్తూ ఉండే పోప్‌ ఫ్రాన్సిస్‌కు నవతరం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో వేలం వెర్రిగా ఫాలోయర్స్‌ పెరుగుతున్నారంటే ఆశ్చర్యమే. పోప్‌ ఫ్రాన్సిస్‌ ట్విట్టర్‌ ఖాతాలో తనకు ఉన్న 9 అకౌంట్ల మొత్తం ఫాలోయర్స్‌ సంఖ్య కలిపి కోటి మందిని దాటడాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. 'ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. మీరిలా నాకోసం ప్రార్థిస్తూ ఉండడాన్ని కొనసాగించాలని కోరుతున్నాను' అంటూ పోప్‌ తనకున్న అన్ని ఖాతాల్లోనూ పేర్కొన్నారు.

కుర్రకారు వేర్వేరు పేర్లతో ట్విట్టర్‌ ఖాతాలను కలిగి ఉండడం మామూలే. అదే తీరులో పోప్‌ ఫ్రాన్సిస్‌కు కూడ 9 ఖాతాలు ఉన్నాయి. కాకపోతే మారుపేర్లతో కాదు.. వేరు భాషల్లో! లాటిన్‌, పోలిష్‌, అరబిక్‌ వంటి భాషల్లో ఆయనకు ఈ ఖాతాలు ఉన్నాయి.

1300 ఏళ్ల వాటికన్‌ చరిత్రలో తొలి నాన్‌ యూరోపియన్‌ అయిన పోప్‌ ఫ్రాన్సిస్‌, ట్విట్టర్‌లో కోటిమంది ఫాలోయర్స్‌ను సంపాదించుకోవడం ద్వారా.. న్యూయార్క్‌ టైమ్స్‌ను కూడా అధిగమించేశాడు. కాకపోతే ర్యాప్‌ గాయకుడు కాన్యే వెస్ట్‌ కంటె వెనకబడి ఉన్నాడు. ఇంతకూ ట్విట్టర్‌ ఖాతాల్లో టాప్‌ ఫాలోయర్స్‌ అంటే,... నాలుగు కోట్ల పైమాటేనట. పాప్‌స్టార్లకే ఈ ఆదరణ ఉంటోంది!

  • Loading...

More Telugu News