: గుజరాత్ కంటే ఉత్తరప్రదేశ్ లోనే మత ఘర్షణలెక్కువ: మదానీ


మౌలానా మహమూద్ మదానీ.. ఈయన 'జామియత్ ఉలేమా ఈ హింద్' జనరల్ సెక్రటరీ. ఇటీవల కాలంలో ముక్కుసూటిగా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గుజరాత్ కంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లోనే మత అల్లర్లు ఎక్కువగా జరుగుతున్నాయంటూ పరోక్షంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పాలనకు కితాబిచ్చారు. గుజరాత్ కంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల జైళ్లలో ముస్లిం యువకులు ఎక్కువ మంది ఉన్నారని మదానీ పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో(2002 గుజరాత్ అల్లర్ల తర్వాత) రాజస్థాన్ లో 48కి పైగా మత ఘర్షణలు జరగ్గా.. ఉత్తరప్రదేశ్ లో గతేడాదిన్నర కాలంలోనే 102 మత అల్లర్లు జరిగాయని మదానీ తెలిపారు.

భారత్ లో ఐకమత్యం, విభజన అనే రెండు వాదనలు ఉన్నాయని, కాంగ్రెస్ నేతలు ఐకమత్యం వైపు దేశాన్ని తీసుకెళతారని ఆశిస్తే వారు విభజన దిశగా అడుగులు వేస్తున్నారని మదానీ అన్నారు. మోడీకి మద్దతు పలుకుతున్నారన్న కాంగ్రెస్ విమర్శలపై స్పందిస్తూ.. గుజరాత్ లో కాంగ్రెస్ నేతలు మోడీ కోసం పనిచేస్తారని చెప్పారు. 2002 నాటి అల్లర్లలో చాలా మంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారని.. కొందరి పేర్లతో కూడిన జాబితాను తన తండ్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఇచ్చారని మదానీ తెలిపారు.

  • Loading...

More Telugu News