: భద్రాద్రి రాముడు మా సొంతం: తెలంగాణవాదులు
ఖమ్మం జిల్లాలో భాగంగా ఉన్న భద్రాచలం డివిజన్ ను విభజనలో భాగంగా ఆంధ్రలో కలిపితే ఊరుకునేది లేదని తెలంగాణవాదులు హెచ్చరించారు. భద్రాచలం తెలంగాణకే సొంతమంటూ నిన్న వాజేడు, చర్ల మండలాలలో తెలంగాణవాదులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వాజేడు మండలం జగన్నాథపురంలో జాతీయ రహదారిపై నాలుగు గంటల పాటు రాస్తారోకో చేశారు. భద్రాద్రిని తెలంగాణ నుంచి విడదీస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా సాగేందుకు, డివిజన్ లో ఉన్న ఖనిజ సంపదను దోచుకునేందుకే భద్రాద్రిని తెలంగాణ నుంచి విడదీసే యత్నాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చర్లలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది.