: పిల్లలకు ఎండ తగలనివ్వండి
పిల్లలను చక్కగా ఎండలో ఆడుకోనివ్వండి... దీనివల్ల వారికి పుష్కలంగా డి విటమిన్ శరీరానికి అందుతుంది. ఎందుకంటే డి విటమిన్ లోపం వల్ల పిల్లల్లో రక్తహీనత కలిగే ప్రమాదముందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. జాన్ హాప్‌కిన్స్ శిశు కేంద్రానికి చెందిన అధ్యయనకర్తలు 10,400 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించి వారిలో విటమిన్ డి, హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించారు.
ఈ పరిశీలనలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండి రక్తహీనత ఉండే పిల్లల్లో విటమిన్ డి కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విటమిన్ డి ఎక్కువగా లోపించిన పిల్లలు మిగిలిన సాధారణ పిల్లలకంటే రెండు రెట్లు ఎక్కువగా రక్తహీనతకు గురయ్యే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ లోపం మరింత ఎక్కువగా ఉంటే రక్తహీనత ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి లోపంతో బాధపడేవారికి సంపూర్ణ ఆహారాన్ని అందిస్తూ చికిత్స చేయాలని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ మెరెడిత్ అట్కిన్సన్ చెబుతున్నారు.