: దీంతో ఏడునెలలపాటు నొప్పి మాయం!


దీర్ఘకాలంగా వేధించే నొప్పి, మూర్ఛ వంటి నాడీసంబంధ వ్యాధులకు చికిత్స చేసే సరికొత్త ప్రోటీన్లను శాస్త్రవేత్తలు సృష్టించారు. వీరు ప్రత్యేకంగా తయారుచేసిన ఒక రసాయన సమ్మేళనంతో వాపుకు సంబంధించిన నొప్పినుండి ఉపశమనాన్ని పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తం పదకొండు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్న బృందం ఇలాంటి దీర్ఘకాలిక నాడీ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే కొత్త ప్రోటీన్‌ను సృష్టించారు.

ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఎన్రికో ఫెరారీ మాట్లాడుతూ బోటాక్స్‌, టెటానస్‌ న్యూరోటాక్సిన్లతో వైద్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలున్నాయని, అయితే ఇవి చాలా ప్రమాదకరమైనవని, వీటివల్ల పక్షవాతం వచ్చే ప్రమాదముందని, ఇందులోని టాక్సిన్లను భాగాలుగా విడగొట్టి, ఆ తర్వాత జిప్పింగ్‌ వ్యవస్థతో వాటిని మళ్లీ కలగలిపామని అందువల్ల ఇవి సురక్షితంగా పనిచేస్తాయని తెలిపారు. క్లోస్టిరీడియం బోటులినం, క్లోస్ట్రీడియం టెటానై న్యూరోట్యాక్సిన్లను సాధారణంగా బోటాక్స్‌, టెటానస్‌ టాక్సిన్‌గా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. వీటిలోని మూలకాలను శాస్త్రవేత్తలు వేరుచేసి ఆ తర్వాత కొత్త జీవ ఔషధ లక్షణాలు కలిగివుండేలా వాటిలోని ప్రోటీన్లను మళ్లీ కలగలిపారు. ఈ క్రమంలో అవాంఛనీయ విష ప్రభావాలను నిర్మూలించగలిగారు. వీటిద్వారా నొప్పికి సంబంధించిన నాడీ కమ్యూనికేషన్‌ను అడ్డుకోగలిగారు. ఫలితంగా కొన్ని నెలలపాటు రుగ్మతలకు ఇది చక్కగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇప్పటి వరకూ ఉన్న నొప్పి నివారణ ఔషధాలు నొప్పిని తాత్కాలికంగా తగ్గించగలిగినా వాటివల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని, తాము తయారుచేసిన తాజా మందు ప్రభావం ఏడు నెలలపాటు నొప్పినుండి ఉపశమనాన్ని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News