: గెహ్లాట్ ను రాహుల్ నమ్మడం లేదు: మోడీ


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్ గాంధీయే నమ్మడం లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో బీజేపీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. టీవీల్లో వచ్చిన ఫ్యామిలీ డ్రామాల్లాగా రాహుల్ ప్రసంగాలు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ తన కుటుంబం గురించి తప్ప మరే విషయాన్ని ప్రస్తావించడం లేదని అన్నారు.

స్వాతంత్ర్య సమరంలో ఆదివాసీలకు ప్రత్యేకస్థానముందని ఆయన అన్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో రాజస్థాన్ లోని పలు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. రాజస్థాన్ లో రాహుల్ గాంధీ ప్రసంగాలు ఎవరికీ అర్ధం కాలేదన్నారు. గెహ్లాట్ కు చెప్పకుండా రాహుల్ రాజస్థాన్ లోని ఇతర ప్రాంతాలకు వెళ్లడం ముఖ్యమంత్రిపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడికే నమ్మకం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

రాజస్థాన్ మంత్రివర్గ కార్యాలయాలకు మహిళలు వెళ్లలేకపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుందని ఆయన అన్నారు. ఇక, బీజేపీ అధికారంలోకి రాగానే ద్రవ్యోల్బణాన్ని అదుపుచేస్తామన్నారు.

  • Loading...

More Telugu News