: సోనియాకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుసా?: జగన్
సమైక్య శంఖారావం సభలో ప్రసంగించిన జగన్.. సోనియాకు సూటి ప్రశ్నలు సంధించారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుసా? అని ప్రశ్నించారు. భారత పౌరసత్వం తీసుకున్న వారందరూ దేశం విడిచి వెళ్ళాలని బిల్లు తెస్తే ఆమెకు నచ్చుతుందా? అని అడిగారు. 'నాది వీర తెలంగాణే తప్ప, వేరు తెలంగాణ కాదు' అన్న రావి నారాయణ రెడ్డి గురించి.. 1955లో సీఎం పదవికి రాజీనామా చేసిన బూర్గుల రామకృష్ణారావు గురించి సోనియాకు తెలుసా? అని ప్రశ్నించారు.
ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం అని జగన్ అభివర్ణించారు. 30 స్థానాలు మనమే సాధించుకుని ఢిల్లీ కోటను బద్దలు కొడదామని, ఢిల్లీ రాజకీయాన్ని మనమే శాసిద్దామని అన్నారు. అవసరమైతే ఎన్నికల వరకు పోరాడాలని జగన్ పిలుపునిచ్చారు. అంతకుముందు, దేశంలో హిందీ తర్వాత తెలుగువారిదే అతి పెద్ద జాతి అని చెప్పారు. ఇప్పుడు తెలుగుజాతి విభజన ముప్పు ఎదుర్కొంటోందని, రేపు దేశంలో మిగతా ప్రాంతాల్లోనూ ఇదే ప్రమాదం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. తెలుగుజాతికి ద్రోహం చేస్తున్న సోనియా, కిరణ్, చంద్రబాబులను క్షమించరాదని జగన్ పిలుపునిచ్చారు.