: విడిపోయే వారే కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవడం సంప్రదాయం: దాడి
సమైక్య శంఖారావం సభలో దాడి వీరభద్రరావు ప్రసంగిస్తూ.. పలు ఆసక్తిర అంశాలపై మాట్లాడారు. హైదరాబాదు తమకే కావాలని తెలంగాణ వారు పట్టుబట్టడం సరికాదన్నారు. విడిపోయే వారే కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవడం ఇప్పటి వరకు సంప్రదాయంగా వస్తోందని ఆయన గుర్తు చేశారు. గుజరాత్.. మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు ముంబయి కావాలని అడిగినా కేంద్రం అంగీకరించలేదని చెప్పారు. కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిందే అని గుజరాత్ కు కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. అప్పట్లో మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగువారు విడిపోయినప్పుడు కూడా కొన్నాళ్ళు కర్నూలు రాజధానిగా కార్యకలాపాలు నిర్వహించుకున్నామని దాడి వెల్లడించారు.
ఇక, బీజేపీ హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కూడా వాటికి నూతన రాజధానులు ఏర్పాటు చేశారని.. ఇప్పుడు, తెలంగాణకు కూడా కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోనియా నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి లబ్ది పొందాలన్నదే సోనియా ఉద్దేశంలా కనిపిస్తోందని దాడి మండిపడ్డారు. దేశంలో 16 రాష్ట్రాల్లో ఇలాంటి 'ప్రత్యేక' ఆందోళనలు ఉన్నా, కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే విభజన నిర్ణయం తీసుకోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.