: కటక్ వన్డే రద్దు.. 2-1తో ఆసీస్ ముందంజ
భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కు వరుణుడి బాధ తప్పడం లేదు. రాంచీ వన్డే వర్షం బారిన పడి రద్దయిన సంగతి తెలిసింది. తాజాగా, ఒడిశాలోని కటక్ లోని బారాబతి స్టేడియంలో జరగాల్సిన ఐదో వన్డే కూడా వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం ఏడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంతో కొనసాగుతోంది. ఈ సిరీస్ లో మరో రెండు వన్డేలు మిగిలి ఉన్నాయి. భారత్ సిరీస్ చేజిక్కించుకోవాలంటే రెండు వన్డేలూ నెగ్గాల్సి ఉంటుంది. ఇక, ఆసీస్ విషయానికొస్తే.. రెండు వన్డేల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా సిరీస్ వశమవుతోంది. ఈ సిరీస్ ఓడినా టీమిండియా నెంబర్ వన్ స్థానానికి మరి కొంత కాలం ఢోకా లేదు. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 117 పాయింట్లు ఉండగా, భారత్ ఖాతాలో 122 పాయింట్లు ఉన్నాయి. కాగా, ఇరు జట్ల మధ్య ఆరో వన్డే ఈ నెల 30న నాగపూర్ లో జరగనుంది.