: 'పద్మశ్రీ నా జీవితాన్ని నాశనం చేసింది... దాన్ని నాతో పాటు సమాధి చేయండి'


చేయితిరిగిన హస్తకళా ప్రవీణుడాయన. సాక్షాత్తు అప్పటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 'ఆయన హస్తకళ.. సాంస్కృతికంగా సుసంపన్నమైనది' అని కొనియాడారు కూడా. 1981లో దేశంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 'పద్మశ్రీ' అవార్డునూ అందుకున్నారు. అయితే, ఇవేవీ అతని జీవితంలో వెలుగును నింపలేదు... సరికదా అతని జీవితాన్ని నాశనం చేశాయి. ఎంతగా అంటే... 'నాతో పాటు నా పద్మశ్రీని కూడా సమాధి చేయండి' అనేంతగా.

వివరాల్లోకి వెళితే... సీతారాంపాల్ (72) ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ జిల్లా షేర్ పూర్ కలాన్ గ్రామవాసి. తివాచీలు తయారుచేయడంలో చేయితిరిగిన నిపుణుడాయన. తన చేతి వృత్తితో కుటుంబాన్ని ఏ లోటూ లేకుండా పోషించుకుంటూ ఉండేవారు. ఆయన కళ ఢిల్లీ వరకు పాకి, ఆయనకు 'పద్మశ్రీ' అవార్డుని కూడా సాధించి పెట్టింది. ఇంకేముంది... ఆయన పేరు ప్రఖ్యాతులు చుట్టుపక్కల ప్రాంతాల్లో మారుమోగిపోయాయి. పద్మశ్రీ అవార్డు రావడంతో... ఇకపై అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని... ఇక ఎలాంటి సమస్యలూ ఉండవని సీతారాంపాల్ భావించారు. కానీ, ఇక్కడే సీనంతా రివర్సయింది. అప్పటిదాకా సీతారాంకు పనిచ్చిన వారు ఆయనకు పని ఇవ్వడానికి భయపడ్డారు. ఆయనను దినసరి వేతనంపై కూలీగా పెట్టుకుంటే ప్రభుత్వంతో సమస్యలొస్తాయేమోనని తివాచీ పరిశ్రమ యాజమాన్యాలు భావించాయి. దీంతో, పనిపోయింది. బతుకుదెరువు కష్టమైపోయింది. ప్రభుత్వం తరపునుంచి ఎలాంటి సహాయ సహకారాలూ అందలేదు. చివరకు చికిత్స చేయించుకోవడానికి డబ్బుల్లేక కంటి చూపును కూడా కోల్పోయారు. తినడానికి సరైన తిండి లేక చిక్కి శల్యమయ్యారు. డబ్బుల్లేని కారణంగా అతని కొడుకు కూడా శుక్లాలతో బాధపడి కంటి చూపును కోల్పోయాడు.

ప్రభుత్వ సాయం కోసం సీతారాంపాల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో లేఖలు రాశారు. ఫలితంగా నెలకు రూ. 300 లు వృద్ధాప్య పింఛనుతో పాటు ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేశారు. ఇవేవీ ఆయన స్థితిగతులను మార్చలేకపోయాయి. ప్రస్తుతం ఆయన... తనను జీవితాంతం వెంటాడిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ... చివరి క్షణాలను గడుపుతున్నారు. ఈ పరిస్థితిలో కూడా ఎంతో ఓపికను కూడగట్టుకుంటూ ఆయన ఒక విషయం చెప్పారు. 'నాతో పాటు నా పద్మశ్రీని కూడా సమాధి చేయండి'.

  • Loading...

More Telugu News