: నేడే సమైఖ్య శంఖారావం... వర్షంలోనూ భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ
రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదనే ప్రజల బలమైన ఆకాంక్షను చాటిచెప్పడానికి వైసీపీ తలపెట్టిన 'సమైక్య శంఖారావం సభ' ఈ రోజు జరగనుంది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ సభను భారీ ఎత్తున నిర్వహించడానికి వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. సభకు హాజరు కావడానికి సీమాంధ్ర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
ఈ రోజు వర్షం కూడా కొంత తెరిపినీయడంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. సభా ప్రాంగణంలో పార్టీ ముఖ్యనేతలు ఆసీనులు కావడానికి 80 అడుగుల వెడల్పు, 44 అడుగుల పొడవైన వేదికను ఏర్పాటుచేశారు. వేదికపై 16 అడుగుల ఎత్తున్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సభకు హాజరైన వారు అతి దగ్గరనుంచి తిలకించడానికి వీలుగా... సభా ప్రాంగణంలో నాలుగు అతిపెద్ద ఎల్ సీడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. దీనికి తోడు స్టేడియానికి వెలుపల నాలుగు మొబైల్ ఎల్ సీడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.