: లక్షలు పలికిన హంతకుడి ఉంగరం!
ఒక హంతకుడి ఉంగరాన్ని లక్షలు పోసి కొంటారా... అది హంతకుడిది అని తెలిసీ కొన్నారంటే ఆ హంతకుడు ఎవరైనా గొప్ప వ్యక్తిని హత్యచేసి ఉండాలి. అప్పుడే వేలం వెర్రి దానిపై ఎగబడేట్టు చేస్తుంది. 1963నాటి అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్.కెనడీని కాల్చి చంపిన హంతకుడి ఉంగరం వేలంలో లక్షలు ధర పలికిందట.
కెనడీ జీవితంతో ముడిపడివున్న దాదాపు మూడు వందల వస్తువులను బోస్టన్‌లోని ఒక సంస్థ వేలం వేసింది. ఇందులో కెనడీని కాల్చి చంపిన లీ హార్వే ఓస్వాల్డ్ పెళ్లి ఉంగరం కూడా ఉంది. ఈ ఉంగరాన్ని కెనడీని హత్యచేసే రోజు ఉదయం ఓస్వాల్డ్ తన ఇంట్లోనే వదిలేశాడట. తర్వాత అది టెక్సాస్‌కు చెందిన ఒక న్యాయవాది వద్దే ఉండిపోయింది. ఆయన మరణానంతరం ఆయన భార్య ఆ ఉంగరాన్ని వేలం వేయడానికి అంగీకరించింది. ఈ ఉంగరాన్ని టెక్సాస్‌కు చెందిన ఒక వ్యక్తి 1,18,000 అమెరికా డాలర్లు అంటే సుమారు రూ.72 లక్షలు పోసి సొంతం చేసుకున్నాడు.