: పోటీ వాతావరణమే కొత్త ఆవిష్కరణలకు నాంది: అబ్దుల్ కలాం
వైద్యులు, సాంకేతిక నిపుణుల్లో నెలకొనే పోటీ వాతావరణమే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని.. అది, వైద్య, ఆరోగ్య రంగంలో చాలా అవసరమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 'సృజన' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి వైద్యానికి సంబంధించి అత్యాధునిక సాంకేతిక అభివృద్ధికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోటెక్ ఆర్థిక సహకారంతో ఎంటీఐ మీడియా ల్యాబ్ ద్వారా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో 'సృజన' కార్యక్రమం నిర్వహిస్తారు. ఇమేజింగ్ ది ఐ, అప్లికేషన్స్ అండ్ ఆల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ పర్ఫెక్షన్, రీ-ఇన్వైటింగ్ విజన్ పేరుతో నాలుగు విస్తృత విభాగాలను అభివృద్ధి చేసేందుకు ఎంఐటీ మీడియా ల్యాబ్ కెమెరా కల్చర్ గ్రూపు కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నిస్తోందని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వర్ రావు అన్నారు. 'సృజన' నూతన ఆవిష్కరణలకు ఇన్ఫోటెక్ రెండున్నర కోట్లు కేటాయిస్తుందని నాగేశ్వర్ రావు అన్నారు.