: మళ్ళీ చెబుతున్నా... తెలంగాణ రాష్ట్రానికి కాపలాకుక్కలా ఉంటా: కేసీఆర్


తెలంగాణే ధ్యేయంగా గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఏమంటున్నారో వినండి. తెలంగాణ రాష్ట్రానికి కాపలాకుక్కలా ఉంటానని పునరుద్ఘాటించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోనని చెప్పారు. కాగా, ఓ ఆంగ్ల వార్తాపత్రిక ఇంటర్వ్యూలో ఇందిరాగాంధీ కుటుంబంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. బాబు వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినట్లుగా లేవన్నారు. తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం అజ్ఞానమని భావించాల్సి ఉంటుందన్నారు. సమన్యాయం చేయాలంటున్న బాబు డిమాండ్ కు అర్ధమేంటన్నారు. ఎలాంటి ఎజెండా లేకుండా ఢిల్లీలో దీక్ష చేసిన ఘనత బాబుదేనని ఎద్దేవా చేశారు. దీక్ష ద్వారా.. తెలంగాణను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని ఇక్కడివారికి అర్ధమైందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

కాగా, పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ఈ రోజు కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ఆయన పలు విషయాలపై మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నందుకు సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కేశవరావు నేతృత్వంలోని బృందం జీవోఎం (మంత్రుల బృందం) కు నివేదికలు అందిస్తుందని, ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలోని 12 మంది సభ్యులు నివేదికను తయారు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాదుపై స్పష్టత కోరుతూ జీవోఎంకు నివేదిక ఇస్తామని, హైదరాబాదుపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని కోరుతున్నామన్నారు. అయితే, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాకే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనంపై ఆలోచిస్తామని చెప్పారు. తెలంగాణ విద్యార్ధులపై వందల కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని కేసీఆర్ అన్నారు. సీమాంధ్రులు తెలంగాణ సమాజంలో కలిసిపోయారని, విభజనకు సీమాంధ్రులు సహకరించాలని కోరిన ఆయన సీడబ్ల్యూసీ స్పష్టంగా చెప్పినా కొంతమంది ఏవేవో మాట్లాడుతున్నారన్నారు.

  • Loading...

More Telugu News