: మోడీ మారానని చెబితే.. మేమూ మారతాం: ముస్లిం పర్సనల్ లా బోర్డు
దేశ రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నట్టు కన్పిస్తోంది. బీజేపీని విపరీతంగా ద్వేషించే ముస్లింలు, ముస్లిం సంస్థలు కొంత వరకు మోడీకి చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ముస్లిం పర్సనల్ లా బోర్డు డిప్యూటీ చీఫ్ మౌలానా కల్బే సాదిక్... తమకు, మోడీకి మధ్య ద్వారాలు మూసుకుపోలేదని అన్నారు. మోడీ మారానని ప్రకటిస్తే... తాము కూడా మారతామని తెలిపారు.
మన దేశంలో నెలకొన్న మతతత్వం పాకిస్థాన్, చైనాకన్నా భయంకరమైనదని మౌలానా సాదిక్ అన్నారు. మోడీ గతంలో చేసినవి మళ్లీ చేయనని హామీ ఇవ్వాలని... దేశానికి చెందిన అతి పెద్ద సవాళ్లపై మాట్లాడాలని సూచించారు. ఏ వ్యక్తి అయినా తప్పుచేశానని అంగీకరిస్తే వారిని ఇస్లాం క్షమిస్తుందని చెప్పారు. ఓట్ల కోసం కొన్ని పార్టీలు అనవసరంగా మోడీ గురించి భయం కలిగేలా మాట్లాడుతున్నాయని అన్నారు. కొద్ది రోజుల క్రితం జమాయత్-ఇ-ఉలేమా-ఇ-హింద్ చీఫ్ మెహ్మూద్ మదానీ కూడా... ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీ ముస్లింలలో భయోత్పాతాలు సృష్టిస్తోందని తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.