: రాష్ట్రపతికి సమైక్య రాష్ట్ర ఆవశ్యకత వివరిస్తాం: అశోక్ బాబు
తాము తాత్కాలికంగా మాత్రమే సమ్మె విరమించామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5 వ తేదీ వరకు నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించి తమ గళాన్ని చాటుతామని అన్నారు. జీఎంవోకు తమ వాదన వినిపిస్తామని ఆయన తెలిపారు. అలాగే, రాష్ట్రపతిని కలిసి సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. వాహనాలకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో సేవ్ ఆంధ్రప్రదేశ్ స్టిక్కర్లు అంటించాలని ఉద్యోగ సంఘాలను ఆయన కోరారు.
ఈ మేరకు 26న ర్యాలీలు, 27న ఉదయం నుంచి సాయంత్రం వరకు జాతీయ రహదారుల దిగ్బంధం, 28న ఉపాధ్యాయులు, ఫించనుదారుల రిలే దీక్షలు, 29న సీమాంధ్ర జిల్లాల్లో మోటారు సైకిల్ ర్యాలీలు, 30న అన్ని జిల్లా కేంద్రాల్లో మానవహారాలు, 31న లంచ్ అవర్ లో ఉద్యోగుల నిరసనలు.. నవంబర్ 1న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసనలు, 2-4 వరకు రైతు సదస్సులు, 5న నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపడతామని అశోక్ బాబు వెల్లడించారు.